• మహిళ ఫిర్యాదుతో అమీన్‌పూర్ పోలీసుల ఎఫ్‌ఐఆర్.. స్టేట్‌మెంట్ నమోదు
సూర్య డిజిటల్ న్యూస్, హైదరాబాద్: లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు సీఐ శ్రీనివాసులు రెడ్డిపై అమీన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా బాధితురాలి స్టేట్‌మెంట్‌ను నమోదు చేస్తున్నట్లు సమాచారం.
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై..
పోలీసుల వివరాల ప్రకారం.. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళను నమ్మించి, ఆమెపై సీఐ లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై గతంలో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి ఫిర్యాదు వెళ్లడంతో అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
విచారణ సందర్భంగా మహిళకు సంబంధించిన వ్యక్తిగత అంశాలను ఉపయోగించుకుని ఇబ్బందులకు గురిచేశారనే ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. కొంతకాలం పాటు సీఐ, సదరు మహిళ ఒకే ఇంట్లో ఉన్నారనే అంశంపైనా విచారణ జరిగినట్లు సమాచారం.
ఇప్పటికే సస్పెన్షన్:
ఈ ఆరోపణల నేపథ్యంలో సీఐ శ్రీనివాసులు రెడ్డిని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మహిళ ఫిర్యాదు మేరకు అమీన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేయడంతో దర్యాప్తు మరింత కీలకంగా మారింది.
కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తున్న పోలీసులు.. బాధితురాలి స్టేట్‌మెంట్‌తో పాటు అందుబాటులో ఉన్న ఆధారాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. దర్యాప్తులో వెల్లడయ్యే వాస్తవాలు, ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసు వర్గాలు తెలిపాయి.