• జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడ, మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
• నోషి పరిశ్రమ యాజమాన్యానికి సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్‌గౌడ్ కృతజ్ఞతలు
సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్:
విద్యాభివృద్ధి, గ్రామీణ పాఠశాలల మౌలిక వసతుల కల్పన కోసం నోషి పరిశ్రమ చేస్తున్న కృషి అభినందనీయమని దేవలమ్మ నాగారం గ్రామ సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. నోషి పరిశ్రమ సహకారంతో చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేపట్టనున్న ప్రహరీ గోడ, విద్యార్థుల మరుగుదొడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధితో పాటు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నోషి పరిశ్రమ అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిలో పరిశ్రమ యాజమాన్యం భాగస్వామ్యం కావడం అభినందనీయమని పేర్కొన్నారు.
పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణంతో భద్రత మెరుగుపడటంతో పాటు, విద్యార్థుల కోసం మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గ్రామాభివృద్ధిలో భాగస్వాములవుతూ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న నోషి పరిశ్రమ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పరిశ్రమ అందిస్తున్న సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలని ఆమె ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుని గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, దాతలు, పరిశ్రమల యాజమాన్యాలు కలిసి కృషి చేస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సుర్కంటి అనూప్‌రెడ్డి, వార్డు సభ్యులు ఊదరి రమేష్, బొమ్మ శ్వేత, బొమ్మ అమరావతి, ఫాతిమా, దోనూరి కిరణ్‌రెడ్డి, గట్టు ప్రశాంత్, పాక రాము, సుంకరి శ్రీను, దేశట్ల చైతన్య, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బొమ్మ మైసయ్య, పంచాయతీ కార్యదర్శి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.