– పోనకల్‌లో పెరుగుతున్న దోమల ఉధృతి
– మురుగు కాలువలు, నీటి నిల్వలతో పారిశుద్ధ్య సమస్యలు
– ఫాగింగ్, మందుల పిచికారీ చేపట్టాలని గ్రామస్థుల డిమాండ్
– ప్రజారోగ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి: మగ్గిడి జయ
– సాయంత్రమైతే ఇళ్లలోకి దోమల దండు: మూల భాస్కర్‌గౌడ్
సూర్య డిజిటల్ న్యూస్, జన్నారం: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వ్యాధుల భయం వెంటాడుతోంది. జన్నారం మండలం పోనకల్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో దోమల ఉధృతి రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పలు వార్డుల్లో మురుగు కాలువలు, ఖాళీ ప్రదేశాలు, నీరు నిలిచే ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపాలు నెలకొనడంతో దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు.
సాయంత్రం వేళల్లో దోమల దండు ఇళ్లలోకి చేరుతుండటంతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దోమల కారణంగా రాత్రివేళల్లో ప్రశాంతంగా నిద్రపోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముందస్తు చర్యలు ఏవీ?
వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. వ్యాధులు ప్రబలిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే నివారణ చర్యలు చేపట్టడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడవచ్చని పేర్కొంటున్నారు.
పంచాయతీ పరిధిలోని అన్ని వార్డుల్లో ఫాగింగ్ నిర్వహించాలని, దోమల నివారణ మందును పిచికారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

సర్పంచ్ వెంటనే స్పందించాలి: మగ్గిడి జయ
పోనకల్‌లో దోమల సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్ వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని మంచిర్యాల జిల్లా సీపీఎం పార్టీ ఉపాధ్యక్షురాలు మగ్గిడి జయ డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు గ్రామపంచాయతీ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
దోమల ద్వారా వివిధ రకాల వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున మురుగు కాలువల శుభ్రత, ఫాగింగ్, మందుల పిచికారీ వంటి చర్యలను తక్షణమే చేపట్టాలని కోరారు. అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు సమగ్ర పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు.

సాయంత్రమైతే దోమల దండు: మూల భాస్కర్‌గౌడ్
గ్రామంలో దోమల సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని స్థానికుడు మూల భాస్కర్‌గౌడ్ తెలిపారు. సాయంత్రం అయ్యిందంటే పెద్ద సంఖ్యలో దోమలు ఇళ్లలోకి చేరుతున్నాయని, దీంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
దోమల బెడద పెరుగుతున్నా సంబంధిత అధికారులు తగిన చర్యలు చేపట్టకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రతి వార్డులో ఫాగింగ్, దోమల నివారణ మందుల పిచికారీ చేపట్టాలని కోరారు .
పోనకల్ గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించి మురుగు కాలువలను శుభ్రం చేయడంతో పాటు నీటి నిల్వలను తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు. దోమల నివారణ చర్యలను నిరంతరం కొనసాగించాలని, ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడకముందే అధికారులు అప్రమత్తం కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.