• రాజగోపాల్‌రెడ్డి పిలుపునకు విశేష స్పందన
• పలు గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు.. ఉల్లంఘిస్తే జరిమానాలు
• మునుగోడు స్ఫూర్తితో పొరుగు నియోజకవర్గాల్లోనూ అమలు
సూర్య డిజిటల్ న్యూస్, మునుగోడు:
గ్రామాల్లో బెల్ట్ షాపులను నిర్మూలించి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పాలన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిర్ణయాలు ఇతర ప్రాంతాల పల్లెలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ఆదర్శంగా తీసుకుని పక్క నియోజకవర్గాల్లోని పలు గ్రామ పంచాయతీలు సైతం బెల్ట్ షాపుల నిర్మూలనకు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి.
పలు గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు:
ఇప్పటికే నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల మండలం తాళ్లవెల్లెంల, ఏపూర్, పెద్దకాపర్తి, పేరేపల్లి గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్మూలనకు పంచాయతీలు తీర్మానాలు చేసినట్లు పేర్కొన్నారు. నల్గొండ నియోజకవర్గంలోని కనగల్ మండల కేంద్ర గ్రామ పంచాయతీ కూడా బెల్ట్ షాపులు నిర్వహించకూడదని తీర్మానం చేసింది. తీర్మానాన్ని ఉల్లంఘించి బెల్ట్ షాపు నిర్వహిస్తే రూ.50 వేల జరిమానా విధించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పిలుపు:
2018లో ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలోనే రాజగోపాల్‌రెడ్డి గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్మూలనకు పిలుపునిచ్చారని కాంగ్రెస్ నాయకులు గుర్తుచేశారు. బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించిన గ్రామాలకు అభివృద్ధి నిధులు అందిస్తామని ఆయన ప్రకటించారని తెలిపారు. నారాయణపూర్ మండలం అల్లందేవిచెరువులో బెల్ట్ షాపులను నిర్మూలించిన సందర్భంగా అప్పటి సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా రూ.6 లక్షలు అందించినట్లు పేర్కొన్నారు.
అయితే అప్పట్లో ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండటంతో నిర్ణయాలను విస్తృతంగా అమలు చేయలేకపోయారని, 2023లో తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం బెల్ట్ షాపుల నిర్మూలనకు చర్యలు చేపట్టారని తెలిపారు.
ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తున్న స్ఫూర్తి:
మునుగోడు నియోజకవర్గంలోని గ్రామాల్లో బెల్ట్ షాపుల నియంత్రణతో ప్రజల్లో మార్పు వస్తోందని, నేరాల నియంత్రణతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతోందని నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పొరుగు నియోజకవర్గాల గ్రామాలు సైతం బెల్ట్ షాపులను నిర్మూలించే దిశగా ముందుకు వస్తున్నాయని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, గ్రామాల ప్రశాంత వాతావరణం కోసం పంచాయతీలు తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు.