SURYA DIGITAL NEWS
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 7:41 pm Posted by : SURYA DIGITAL NEWS

ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మహిళపై అత్యాచారం

• సిమెంట్‌ బస్తాలు ఇస్తానంటూ ఇంటికి పిలిచి అఘాయిత్యం చేసినట్లు ఫిర్యాదు

• రెండు నెలలుగా వేధింపులు..

• కేసు పెట్టకుండా భూమి ఇస్తామని రాయబారం

• ఆత్మకూరు(ఎం) పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

సూర్య డిజిటల్ న్యూస్, ఆత్మకూరు(ఎం):

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పుల్లాయగూడెంలో ఓ మహిళపై అత్యాచారం జరిగినట్లు వచ్చిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని నమ్మించి, సిమెంట్‌ బస్తాలు ఇస్తానంటూ ఇంటికి పిలిచి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు మాలి శంకర్‌రెడ్డిపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు విషయంలో సహాయం చేస్తానని నమ్మించిన నిందితుడు, సిమెంట్‌ బస్తాలు ఇస్తానంటూ ఆమెను ఇంటికి పిలిచినట్లు పేర్కొన్నారు. అక్కడ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, అనంతరం కూడా బెదిరిస్తూ గత రెండు నెలలుగా వేధింపులకు గురిచేశాడని బాధితురాలు ఆరోపించినట్లు తెలుస్తోంది.

భర్తకు తెలియడంతో పంచాయితీ:

ఈ విషయం బాధితురాలి భర్తకు తెలియడంతో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించినట్లు సమాచారం. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా బాధితురాలిని, ఆమె భర్తను బెదిరించినట్లు ఆమె ఆరోపించినట్లు తెలుస్తోంది. కేసు పెట్టకుండా ఉంటే అర ఎకరం భూమి ఇస్తామని కొందరు పెద్దల ద్వారా రాయబారం పంపినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణ:

ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన మహిళలపై నిందితుడు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు కూడా బాధితురాలు ఆరోపించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై గ్రామంలో తీవ్ర చర్చ జరుగుతోంది.

పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు:

తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు ఆత్మకూరు(ఎం) పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆరోపణలపై సమగ్ర విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.