• ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్.. అక్కడికక్కడే రాజు మృతి
• మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి జన్మదిన ఫ్లెక్సీ ఏర్పాటులో విషాదం
సూర్య డిజిటల్ న్యూస్, నల్గొండ: నల్గొండ నగరంలో ఫ్లెక్సీల ఏర్పాటు మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీ పనుల్లో ఓ యువకుడు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని నింపింది. మృతుడు రాజు అని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే అతడిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ, అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఈ ఘటనతో ప్రమాదకర ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న తీరుపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాయకుల జన్మదినాలు, పార్టీ కార్యక్రమాల పేరుతో నగరంలో నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన ఫ్లెక్సీని ఘటన అనంతరం ఆగ్రహించిన ప్రజలు చించివేసినట్లు సమాచారం.

అనుమతులు లేకుండానే అనేక చోట్ల భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ, నగరపాలక సంస్థ పర్యవేక్షణ ఏమైందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్టీ నాయకుల ఫ్లెక్సీలు నెలల తరబడి నగరంలోని పలు ప్రాంతాల్లో దర్శనమిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అత్యంత ప్రమాదకరమని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక్క చిన్న నిర్లక్ష్యం ఓ నిరుపేద కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఫ్లెక్సీల ఏర్పాటు, వాటి అనుమతులు, భద్రతా ప్రమాణాలపై సరైన పర్యవేక్షణ జరిగి ఉంటే ఈ ప్రమాదం తప్పేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రాణం పోయిన తర్వాత చర్యలు తీసుకోవడం వల్ల ఏం ప్రయోజనమని ప్రజలు నిలదీస్తున్నారు.
రాజు కుటుంబానికి ఎవరు అండగా నిలుస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఫ్లెక్సీల కోసం పేదల ప్రాణాలే బలికావాలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతుడి కుటుంబానికి తగిన న్యాయం, ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికైనా నల్గొండ నగరపాలక సంస్థ మేల్కొని నిబంధనలు ఉల్లంఘిస్తూ ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లోని ఫ్లెక్సీలను వెంటనే తొలగించి, అనుమతులు లేకుండా ఏర్పాటు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరో ప్రాణం పోయే వరకు వేచి చూస్తారా.. లేక ఇప్పటికైనా కొరడా ఝళిపిస్తారా?