SURYA DIGITAL NEWS
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 1:48 pm Posted by : SURYA DIGITAL NEWS

అమెరికాలో తెలంగాణ యువకుడి ఆత్మహత్య

ప్రేమించిన యువతి దూరమైందనే మనస్తాపంతో సాయిప్రదీప్ బలవన్మరణం

సూర్య డిజిటల్ న్యూస్, మేడ్చల్: ప్రేమ విఫలమైందనే మనస్తాపంతో అమెరికాలో ఉన్న తెలంగాణకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ పరిధిలోని శ్రీనివాసనగర్‌కు చెందిన నాగభైరవ కృష్ణ, విజయలక్ష్మి దంపతుల చిన్న కుమారుడు సాయిప్రదీప్ అమెరికాలో బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కృష్ణ, విజయలక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు 2023లో అమెరికాకు వెళ్లగా, చిన్న కుమారుడు సాయిప్రదీప్ 2024లో అమెరికాకు వెళ్లి అన్నతో కలిసి ఉంటున్నాడు. అక్కడ పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ ఉన్న సమయంలో సిద్ధిపేటకు చెందిన ఓ యువతి పరిచయం కావడంతో ఆమెను ప్రేమించాడు.

సుమారు తొమ్మిది నెలల పాటు ప్రేమించుకున్న అనంతరం ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సాయిప్రదీప్ తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లాడు. తొలుత వారు అంగీకరించకపోయినా, అనంతరం వివాహానికి సమ్మతించినట్లు సమాచారం.

అయితే కొంతకాలంగా తాను ప్రేమించిన యువతి దూరంగా ఉంటుండటంతో సాయిప్రదీప్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నెల 21న ఆమెకు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందన రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రదీప్, ఆవేశంలో తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

యువకుడి మృతితో దమ్మాయిగూడలోని కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విదేశాల్లో ఉన్న కుమారుడు ఆకస్మికంగా మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.