SURYA DIGITAL NEWS
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 2:16 pm Posted by : SURYA DIGITAL NEWS

చౌటుప్పల్‌లో భగ్గుమన్న అఖిలపక్ష నిరసన

  • కమిషనర్ తీరును నిరసిస్తూ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బహిష్కరణ

  • రూ.40 లక్షల నిధుల ఖర్చుపై రాని స్పష్టత.. రికార్డులు మాయం!

సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్ : ప్రజా సమస్యలను గాలికొదిలి, అధికారుల ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్న తీరుపై చౌటుప్పల్ పట్టణంలో నిరసనల గళం వినిపించింది. మున్సిపల్ కార్యాలయంలో గురువారం జరగాల్సిన కౌన్సిల్ సమావేశం అఖిలపక్ష కౌన్సిలర్ల నిరసనతో వేడెక్చింది. కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించి నేరుగా కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

పాలనలో పారదర్శకత కరువైందని, మినిట్ బుక్, ఎంబీ రికార్డులు, తొలి కౌన్సిల్ తీర్మానాలను అడిగినా చూపించడం లేదని ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీసు మరమ్మతుల పేరుతో రూ.40 లక్షలు స్వాహా చేశారన్న విమర్శలు వస్తున్నాయని, దీనిపై పూర్తి వివరాలు కోరినా అధికారులు పెడచెవన పెడుతున్నారని దుయ్యబట్టారు.

ప్రజలపై నల్లా పన్ను భారం తగదు: పదేళ్లుగా అమలులో లేని ఇంటి నల్లా పన్నును ఇప్పుడు కొత్తగా వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారని బీఆర్ఎస్, బీజేపీ ఫ్లోర్ లీడర్లు కొయ్యడ శేఖర్ గౌడ్, బుడ్డ సురేష్‌ మండిపడ్డారు. తక్షణమే ఈ పన్ను వసూళ్లను నిలిపివేయాలని, దీనిపై కౌన్సిల్‌లో ప్రత్యేక తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఊదరి యాదయ్య, గడ్డం ఇందిరా రాజరత్నం, పోలేపల్లి లక్ష్మీ ముత్తయ్య పాల్గొన్నారు.