– ఇద్దరు నిందితుల అరెస్ట్.. ఫ్రాంక్స్ కారు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం
– ఒడిశా నుంచి తెలంగాణకు అక్రమ రవాణా
– 20 ప్యాకెట్లలో 20.360 కిలోల గంజాయి గుర్తింపు
– చౌటుప్పల్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన నిందితులు
సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్ :
అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 20.360 కిలోల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు, ఒక ఫ్రాంక్స్ కారును స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ్ కుమార్ ఆధ్వర్యంలో ఈగల్ ఫోర్స్ సహకారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి నిందితులను పట్టుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 27న చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్ ఎస్సై ఎస్. కృష్ణమాల్‌కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసు సిబ్బంది ఎన్‌హెచ్-65 హైదరాబాద్ రోడ్డులోని చౌటుప్పల్ ఎలక్ట్రిక్ సబ్‌స్టేషన్ సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో ఓడి02డిఎస్897 నంబర్ గల ఫ్రాంక్స్ కారును అనుమానంతో ఆపి తనిఖీ చేయగా, వాహనం వెనుక డిక్కీలో బ్రౌన్ టేపుతో చుట్టిన ప్యాకెట్లు గుర్తించారు. వాటిని పరిశీలించగా గంజాయి ఉన్నట్లు నిర్ధారణ అయింది.
20 ప్యాకెట్లలో గంజాయి:
మొత్తం 20 ప్యాకెట్లలో 20.360 కిలోల గంజాయి ఉన్నట్లు తూకం వేసి నిర్ధారించారు. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుల వద్ద ఉన్న మూడు మొబైల్ ఫోన్లు, గంజాయి తరలించేందుకు ఉపయోగించిన ఫ్రాంక్స్ కారును పోలీసులు సీజ్ చేశారు.

ఈ కేసులో ఒడిశా రాష్ట్రం కేంద్రపారా జిల్లాకు చెందిన త్రిలోచన్ సామంత్రా (30), సాగర్‌బాల్ (23)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అధిక ధరకు విక్రయించేందుకు తరలింపు:
పోలీసుల విచారణలో నిందితులు ఒడిశా నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి, తెలంగాణలో అధిక ధరకు విక్రయించేందుకు అక్రమంగా తరలిస్తున్నట్లు వెల్లడైంది. గంజాయి తరలింపునకు నిందితులకు రూ.50 వేల వరకు పారితోషికం ఇస్తామని ఆఫర్ చేసినట్లు కూడా విచారణలో తెలిసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ అక్రమ గంజాయి రవాణాలో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.