SURYA DIGITAL NEWS
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 11:35 am Posted by : SURYA DIGITAL NEWS

యాదాద్రి కొండపై ఘోర రోడ్డు ప్రమాదం

• కారు ఢీకొని యాచకురాలు మృతి

• భక్తుల రద్దీ వేళ విషాదం.. వాహనాల వేగంపై స్థానికుల ఆందోళన

• నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

సూర్య డిజిటల్ న్యూస్, యాదగిరిగుట్ట : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రం కొండపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు ఢీకొనడంతో కొండపైనే ఉంటూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ నిరుపేద మహిళ మృతి చెందింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో తీవ్ర విషాదం నెలకొంది.

స్థానికుల వివరాల ప్రకారం.. కొంతకాలంగా యాదాద్రి కొండపైనే ఉంటూ దేవుని సన్నిధిలో యాచక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మహిళను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

భక్తుల రద్దీ అధికంగా ఉన్న సమయంలో వాహనం వేగంగా రావడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుణ్యక్షేత్రం పరిధిలో భక్తుల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.

వేగ నియంత్రణపై ఆందోళన

యాదాద్రి కొండపై భక్తులు, వృద్ధులు, చిన్నారులు, యాచకులు పెద్ద సంఖ్యలో సంచరిస్తుంటారని, ఇలాంటి ప్రాంతాల్లో వాహనాలను నియంత్రణ లేకుండా నడపడం ప్రమాదాలకు దారితీస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనాల వేగ నియంత్రణతో పాటు ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

కఠిన చర్యలు తీసుకోవాలి

పుణ్యక్షేత్ర పరిధిలో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలను అతివేగంగా నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు, స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.