• చౌటుప్పల్లో భూ ఆక్రమణకు యత్నించారంటూ ఫిర్యాదు
• భూమి చుట్టూ నాటిన కడీలు ధ్వంసం చేశారని ఆరోపణ
• గతంలోనూ దాడులు జరిగాయని బాధిత కుటుంబం వెల్లడి
సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్: భూముల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భూ వివాదాలు తెరపైకి వస్తున్నాయి. చౌటుప్పల్ రెవెన్యూ పరిధిలో తండ్రి విక్రయించిన భూమి విషయంలో ఆయన కుమారులు అడ్డంకులు సృష్టిస్తూ, భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బొమ్మిడి నర్సిరెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల భూమి చుట్టూ నాటిన కడీలను ధ్వంసం చేశారంటూ నర్సిరెడ్డి కుమారుడు రామ్ మనోహర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని బాధిత కుటుంబం వెల్లడి:
వివరాల్లోకి వెళితే.. చౌటుప్పల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 336/ఉ/5లో ఉన్న ఒక ఎకరం భూమిని మైలారం నర్సింహా నుంచి బొమ్మిడి నర్సిరెడ్డి 2003లో డాక్యుమెంట్ నంబర్ 109/2003 ద్వారా కొనుగోలు చేసినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. అనంతరం భూమిని సాగు చేసుకునేందుకు చదును చేసే సమయంలో మైలారం నర్సింహా కుటుంబ సభ్యులు పలుమార్లు అడ్డుకుని దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు.
ఈ వివాదంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ఓఎస్ నంబర్ 231/2016 కేసులో 2018 జూలై 30న తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని నర్సిరెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు. అయినప్పటికీ భూమిని సాగు చేసుకునేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ అడ్డంకులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. జేసీబీతో భూమిని చదును చేసేందుకు వెళ్లిన సమయంలోనూ దాడి జరిగిందని, ఈ విషయమై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
కడీలు ధ్వంసం చేశారని తాజా ఫిర్యాదు:
ఇటీవల బొమ్మిడి నర్సిరెడ్డి మృతి చెందడంతో ఆయన కుమారుడు రామ్ మనోహర్ రెడ్డి భూమిని చదును చేసి హద్దుల గుర్తింపునకు కడీలు నాటినట్లు తెలిపారు. అయితే మైలారం నర్సింహా కుమారులు వాటిని ధ్వంసం చేశారని ఆరోపించారు. దీంతో ఆస్తి నష్టం జరిగిందంటూ రామ్ మనోహర్ రెడ్డి తాజాగా పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.
ఈ భూమి వివాదానికి సంబంధించి గతంలోనూ మైలారం నర్సింహా కుటుంబ సభ్యులపై పలు ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు ఫిర్యాదుదారుల వర్గం చెబుతోంది. భూమి యాజమాన్య హక్కులు, తాజా ఫిర్యాదులోని ఆరోపణలపై పోలీసుల విచారణతో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.