• బేతుపల్లి చెరువు అలుగు ఉద్ధృతికి కొట్టుకుపోయిన రెండు రెస్క్యూ బోట్లు
• బోట్లలో 11 మంది సిబ్బంది, ఐదుగురు మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం
• తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల ఆదేశం.. రంగంలోకి కలెక్టర్
సూర్య డిజిటల్ న్యూస్, సత్తుపల్లి/ఖమ్మం :
ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీటి వరదలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు రాష్ట్ర ఆపద స్పందన దళం (ఎస్డీఆర్‌ఎఫ్) సిబ్బందితో కూడిన రెండు రెస్క్యూ బోట్లు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యాయి.
చెరువుకు భారీగా అలుగు పారడంతో చేపలు కొట్టుకుపోకుండా వల కట్టేందుకు ఎనిమిది మంది మత్స్యకార సొసైటీ సభ్యులు చెరువులోకి వెళ్లారు. వర్షపు నీరు ఒక్కసారిగా ముంచెత్తడంతో వారంతా నీటి మధ్యలోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లా కలెక్టర్ దివాకర్ పర్యవేక్షణలో ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి.
మొదట ఒక బోటు ద్వారా ముగ్గురు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మిగిలిన ఐదుగురిని కాపాడేందుకు రెండు బోట్లలో ఎస్డీఆర్‌ఎఫ్ బృందం చెరువులోకి వెళ్లగా, అలుగు ఉద్ధృతికి నియంత్రణ తప్పి రెండు బోట్లు కొట్టుకుపోయాయి. ప్రమాద సమయంలో ఆ రెండు బోట్లలో 11 మంది ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, ఐదుగురు మత్స్యకారులు ఉన్నట్లు తెలిసింది. గల్లంతైన వారిని కాపాడేందుకు మరో బోటు సాయంతో తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.