– NH-65పై భయానక ప్రమాదం
– క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ను రెండు గంటలు శ్రమించి రక్షించిన పోలీసులు, ఫైర్ సిబ్బంది
– ముగ్గురికి స్వల్ప గాయాలు.. 63 మంది ప్రయాణికులు సురక్షితం
సూర్య డిజిటల్ న్యూస్, మునగాల :
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారి-65పై రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడటంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
నర్సాపూర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సును, ఏలూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు బస్సులు అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాయి.
క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్:
ప్రమాద తీవ్రతకు ఏపీఎస్ఆర్టీసీ బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న మునగాల ఎస్ఐ సంజీవరెడ్డి ఆధ్వర్యంలోని పోలీసులు, ఎన్హెచ్-65 సిబ్బంది, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. డ్రైవర్ను బయటకు తీసేందుకు సుమారు రెండు గంటల పాటు శ్రమించి, చివరకు సురక్షితంగా బయటకు తీశారు.
కల్వర్టు, చెట్టును ఢీకొని ఆగిన బస్సు:
ప్రమాద సమయంలో ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు రహదారి కిందికి దూసుకెళ్లింది. పక్కనే ఉన్న కల్వర్టును, చెట్టును ఢీకొని అక్కడే ఆగిపోవడంతో మరింత ప్రమాదం తప్పింది. బస్సు ఇంకా ముందుకు దూసుకెళ్లి ఉంటే పరిస్థితి తీవ్రంగా ఉండేదని స్థానికులు పేర్కొన్నారు.
63 మంది ప్రయాణికులు
ప్రమాద సమయంలో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో 31 మంది, ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు బస్సుల్లో కలిపి మొత్తం 63 మంది ప్రయాణికులు ఉండగా, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా, మిగిలిన ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
ప్రయాణికులను గమ్యస్థానాలకు తరలింపు
ప్రమాదంతో కొంతసేపు జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా పోలీసులు వెనుక నుంచి వచ్చే బస్సులను ఆపి, ప్రమాదానికి గురైన బస్సుల్లోని ప్రయాణికులను ఇతర బస్సుల్లోకి ఎక్కించి వారి గమ్యస్థానాలకు పంపించారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి సహాయక చర్యలు చేపట్టడంతో ప్రాణనష్టం తప్పింది. ముఖ్యంగా క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ను సకాలంలో బయటకు తీసుకురావడంతో పెను విషాదం తప్పిందని అధికారులు తెలిపారు.

