- అకస్మాత్తుగా బ్రేక్ వేసిన గుర్తుతెలియని వాహనం
- చౌటుప్పల్ పరిధిలోని పంతంగి వద్ద దుర్ఘటన
సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్: పంతంగి టోల్గేట్ సమీపంలో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన నోముల దీపక్ (22) హైదరాబాద్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గురువారం రాత్రి దీపక్ తన స్నేహితుడు దున్నపోతుల శ్రీకాంత్‌తో కలిసి బైక్‌పై స్వగ్రామానికి పయనమయ్యాడు. జగన్నాథపురం మునగాల మండలానికి చెందిన మరో స్నేహితుడు చీమ ఉదయ్ వారి వెనుకాలే మరొక బైక్‌పై వస్తున్నాడు.
రాత్రి 9:20 గంటల సమయంలో చౌటుప్పల్ మండలం పంతంగి టోల్గేట్ వద్దకు చేరుకోగానే, వారి ముందు వెళ్తున్న ఒక వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేసింది. బైక్ వేగంగా ఉండటంతో అదుపు చేయలేక ముందు ఉన్న వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న దీపక్ తలకు ఆ వాహనం హుక్ బలంగా గుచ్చుకోవడంతో తల పగిలి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న శ్రీకాంత్‌కు తీవ్ర గాయాలు కాగా, వెనుక బైక్‌పై వస్తున్న ఉదయ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు చౌటుప్పల్ ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. శ్రీకాంత్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై డి.నర్సిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

