Wednesday, September 23, 2026
spot_img
HomeCrimeతహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

📰 Generate e-Paper Clip

రైతు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు రెవెన్యూ అధికారులు

రూ.20 వేలు డిమాండ్.. రూ.14 వేలకు ఒప్పందం

గ్రామ పాలన అధికారి అహ్మద్, ఆర్‌ఐ పూర్ణచంద్రరావు అదుపులో

సూర్య డిజిటల్ న్యూస్, ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రైతు నుంచి లంచం తీసుకుంటుండగా కొలనుపాక గ్రామ పాలన అధికారి (జీపీఓ) అహ్మద్, ఆర్‌ఐ పూర్ణచంద్రరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనతో తహసీల్దార్ కార్యాలయంలో కలకలం రేగింది.

వివరాల్లోకి వెళితే.. ధర్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన బుడిగె మహేష్ తండ్రి ఉప్పలయ్య మృతి చెందడంతో, ఆయన పేరుపై ఉన్న పట్టాకు సంబంధించి తన పేరును నమోదు చేయించుకునేందుకు రెవెన్యూ అధికారులను ఆశ్రయించాడు. ఈ పనికి ఆర్‌ఐ పూర్ణచంద్రరావు రూ.20 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఇరువురి మధ్య రూ.14 వేలకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

లంచం ఇవ్వడం ఇష్టం లేక బాధితుడు మహేష్ ఏసీబీ అధికారులను సంప్రదించినట్లు తెలిసింది. ఏసీబీ అధికారుల సూచనల మేరకు సోమవారం కొలనుపాక గ్రామ పాలన అధికారి అహ్మద్‌కు రూ.14 వేల నగదు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. అనంతరం గ్రామ పాలన అధికారి అహ్మద్‌తో పాటు ఆర్‌ఐ పూర్ణచంద్రరావును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారుల పాత్రపై విచారణ జరుపుతున్నారు. ఏసీబీ అధికారుల అధికారిక ప్రకటన అనంతరం మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SDN News App

Add to home screen for faster loading and latest updates.