చిమ్మ చీకటిలో ‘పాలవెల్లి’.. జమ్మి పూజల్లో తిప్పలు!
- వలిగొండ మండలం పులిగిల్లలో ప్రజల అవస్థలు
- లైట్లు ఏర్పాటు చేయని పంచాయతీ పాలకవర్గం
- కనీస సదుపాయాలు కల్పించాలంటూ గ్రామీణుల డిమాండ్
సూర్య డిజిటల్ న్యూస్, వలిగొండ : విజయదశమి పండగ వేళ జమ్మి చెట్టు వద్ద పూజలు నిర్వహించి, బంగారంగా భావించే జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకోవడం తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల్లో ముఖ్యాంశం. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామంలో ఈ ఏడాది విజయాదశమి వేడుకల్లో గ్రామస్థులకు తీవ్ర నిరాశ, అవస్థలు ఎదురయ్యాయి.

చీకటిలోనే జమ్మి చెట్టు పూజలు చేస్తున్న దృశ్యం..
గ్రామంలోని జమ్మి చెట్టు ప్రాంగణంలో కనీస వెలుగు దీపాలు (లైట్లు) కూడా ఏర్పాటు చేయకపోవడంతో పండగ సాయంత్రం ప్రజలు చిమ్మ చీకటిలోనే తీవ్ర ఇబ్బందుల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సి వచ్చింది. చీకట్లో జమ్మి ఆకులను కోసుకోవడం, ఏమీ కనిపించక ఒకరినొకరు గుర్తుపట్టలేకపోవడంతో వృద్ధులు, మహిళలు, పిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఊరి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నామని చెప్పుకునే పంచాయతీ పాలకవర్గం, ఏటా ఘనంగా జరిగే విజయదశమి వేడుకల వేళ జమ్మి చెట్టు వద్ద లైట్ల సౌకర్యం కల్పించకపోవడంపై గ్రామస్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకవర్గం స్పందించి రాబోయే పండుగల నాటికైనా జమ్మి చెట్టు ప్రాంగణంలో శాశ్వత వెలుగు దిశగా చర్యలు తీసుకోవాలని పులిగిల్ల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

