Wednesday, September 23, 2026
spot_img
HomeTelanganaయాదాద్రి భువనగిరిఅంకిరెడ్డిగూడెంలో డంపింగ్‌ యార్డు వద్దు

అంకిరెడ్డిగూడెంలో డంపింగ్‌ యార్డు వద్దు

📰 Generate e-Paper Clip

నిర్మాణ పనులు నిలిపివేయాలని కలెక్టర్‌కు గ్రామస్థుల వినతి

పాఠశాలలు, జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని డిమాండ్

సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్‌ హామీ

గ్రామ సర్పంచ్‌ సుర్వి మల్లేష్‌గౌడ్‌

సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్ :

అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్‌ 326లో డంపింగ్‌ యార్డు ఏర్పాటుకు చేపడుతున్న నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ గ్రామస్థులు సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. లింగోజిగూడెం రెవెన్యూ పరిధిలోని స్మశానవాటిక పక్కన ఉన్న కట్ట స్థలం నుంచి మైనార్టీ పాఠశాల వెనుక భాగం వరకు డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేసేందుకు పనులు చేపడుతున్నారని గ్రామస్థులు తెలిపారు.

చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిసర ప్రాంతాల నుంచి సేకరించే చెత్తను ఇక్కడ నిల్వ చేస్తే జనావాసాలతో పాటు మైనార్టీ పాఠశాల, జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల విద్యార్థులు, సమీపంలోని రెండు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డంపింగ్‌ యార్డును జనావాసాలు, పాఠశాలలకు కనీసం రెండు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

కలెక్టర్‌కు వినతి:

గ్రీవెన్స్‌ డే సందర్భంగా గ్రామ సర్పంచ్‌ సుర్వి మల్లేష్‌గౌడ్‌ ఆధ్వర్యంలో గ్రామ పాలకవర్గ సభ్యులు, మహిళలు, యువకులు, వివిధ పార్టీల నాయకులు పార్టీలకతీతంగా కలిసి కలెక్టర్‌, జిల్లా పంచాయతీ అధికారికి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) భాస్కరరావు చౌటుప్పల్‌ మున్సిపల్‌ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి, డంపింగ్‌ యార్డు ఏర్పాటును నిలిపివేయాలని సూచించినట్లు గ్రామస్థులు తెలిపారు. మైనార్టీ పాఠశాలలో సుమారు 600 మంది విద్యార్థులు ఉన్న విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్లారు.

ఇతర ప్రాంతానికి తరలిస్తాం:

డంపింగ్‌ యార్డును తప్పనిసరిగా ఇతర ప్రాంతానికి తరలించి ప్రజల ఆరోగ్యాలను కాపాడతామని, రెండు గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ సుర్వి సత్తయ్యగౌడ్‌, దొడ్ల అండాలు, రాపోలు రేణుక, బొమ్మని శ్రావణి, స్వామిగౌడ్‌, యాట శంకరయ్య, పర్ని శ్రీనివాస్‌రెడ్డి, దొడ్ల సెట్టయ్యగౌడ్‌, భీమగోని మల్లేశంగౌడ్‌, ముద్దం లక్ష్మయ్యగౌడ్‌, అంతటి జంగయ్యగౌడ్‌, రాపోలు మల్లేశం, సుర్వి నరసింహ, భీమగోని మణికుమార్‌, బోడెపు లక్ష్మయ్యగౌడ్‌, గ్రామ మహిళలు, యువకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SDN News App

Add to home screen for faster loading and latest updates.