Wednesday, September 23, 2026
spot_img
HomePoliticalస్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలి: సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలి: సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

📰 Generate e-Paper Clip

చౌటుప్పల్‌లో ‘ప్రజా చైతన్య యాత్ర’కు ఘన స్వాగతం

సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్:

స్థానిక పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ప్రజా చైతన్య యాత్ర’ ఆదివారం చౌటుప్పల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… స్థానిక ప్రజలు అన్ని విధాలుగా నష్టపోతున్నప్పటికీ, పరిశ్రమల యాజమాన్యాలు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.

చౌటుప్పల్ పరిధిలోని పరిశ్రమల కారణంగా వందలాది ఎకరాల వ్యవసాయ భూములు, పంటలు, భూగర్భ జలాలు తీవ్రంగా కలుషితమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమల వల్ల పర్యావరణ పరంగా నష్టపోతున్న స్థానిక గ్రామాల యువతకు ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందన్నారు.

కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా కొన్ని పరిశ్రమలు నడుస్తున్నాయని ఆరోపించారు. ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో సమాచారం బయటకు రాకుండా చూసి, కార్మిక కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నామమాత్రపు తనిఖీలకే పరిమితమై పరిశ్రమల యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి స్థానిక యువతకు పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రామీణ యువతను సమీకరించి పరిశ్రమల ఎదుట ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను అదుపులోకి తెచ్చి పేద, మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్‌రెడ్డి, బచ్చనగోని గాలయ్య, టీఎస్‌పీఎన్ఎమ్ రాష్ట్ర అధ్యక్షులు కురిమిద్దె శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు దుబ్బాక భాస్కర్, కలకొండ సంజీవ, చిలివేరు అంజయ్య, సుర్వి నర్సింహా, కొండూరి వెంకటేష్, బూడిగపాక జగన్, చలం పాండురంగరావు, ముత్యాల అంజయ్య, పిల్లి శంకరయ్య, ఉడుత రామలింగం, బద్దుల సుధాకర్, టంగుటూరు రాములు, రొండి నర్సింహా, దాసరి అంజయ్య, రోషణగారి అంజయ్య, గుడ్డేటి బిక్షపతి, కుంటి పాపయ్య, మనోహర్‌తో పాటు ఏఐటీయూసీ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install SDN News App

Add to home screen for faster loading and latest updates.