• 36 ఏళ్ల దానయ్య మృతదేహం గుర్తింపు
• ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించిన క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్
• హత్యకు కారణాలపై పలు కోణాల్లో పోలీసుల దర్యాప్తు
సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్:
చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పంతంగి గ్రామం చనగలగుట్ట వద్ద రైతు దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన రాపోలు దానయ్య (36) మృతదేహం ఆదివారం చనగలగుట్ట ప్రాంతంలో లభ్యమైంది. ఘటనతో పంతంగి, అంకిరెడ్డిగూడెం గ్రామాల్లో విషాదం నెలకొంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దానయ్య హత్యకు గురైనట్లు సమాచారం అందడంతో చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పరిశీలించి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు.
ఆధారాల కోసం విస్తృత తనిఖీలు:
హత్య ఘటనపై క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించిన పోలీసులు సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. నిందితులకు సంబంధించిన ఆధారాల కోసం పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
నిందితుల కోసం పోలీసుల వేట:
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. వ్యక్తిగత కక్షలు, ఇతర కారణాలపై పలు కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం దర్యాప్తును వేగవంతం చేసినట్లు ఇన్‌స్పెక్టర్ మన్మధ కుమార్ తెలిపారు.

