– చిన్న నాగిరెడ్డి, సురేష్‌కుమార్ మృతి.. 10 మందికి తీవ్ర గాయాలు
– నిమిషాల్లో ముంచెత్తిన మంటలు.. 8 మంది పరిస్థితి విషమం
– హైదరాబాద్‌కు క్షతగాత్రుల తరలింపు
– నెలన్నర వ్యవధిలోనే మరో ఘోరం.. యాజమాన్య నిర్లక్ష్యమే కారణమా?
– భయాందోళనలో పరిసర గ్రామాల ప్రజలు

సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్:
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం శివారులోని హెజీలో ల్యాబొరేటరీస్ కెమికల్ పరిశ్రమలో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీలోని రియాక్టర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోవడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో నల్లగొండ జిల్లా పెద్దవూర మండలానికి చెందిన చిన్న నాగిరెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన నాగనబోయిన సురేష్‌కుమార్ మృతి చెందినట్లు సమాచారం. క్షతగాత్రుల్లో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. మిగతా వారికి సమీప ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

నైట్ షిఫ్ట్‌లో ఊహించని ఘోర ప్రమాదం:
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హెజీలో కంపెనీలోని సీ-బ్లాక్‌లో నైట్ షిఫ్ట్‌లో సుమారు 18 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కెమికల్ రియాక్టర్ భారీ శబ్దంతో పేలిపోయింది. పేలుడు ధాటికి మంటలు క్షణాల్లో వ్యాపించడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీసు సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. రియాక్టర్ పేలుడుకు సాంకేతిక లోపమా, నిర్వహణ లోపమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భద్రతా ప్రమాణాలపై తీవ్ర విమర్శలు:
హెజీలో ల్యాబొరేటరీస్‌లో భద్రతా చర్యలను యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత జూలై 16న ఇదే పరిశ్రమలో రసాయన విషవాయువులు పీల్చి అనంతపురం జిల్లా సింగనమల మండలం ఉల్లికల్లుకు చెందిన అలుమూరు కృష్ణారెడ్డి (42) మృతి చెందిన ఘటన మరువకముందే మరో భారీ ప్రమాదం జరగడం కార్మికుల్లో ఆందోళన కలిగిస్తోంది. నెలన్నర వ్యవధిలోనే పరిశ్రమలో మరో ఘోర ప్రమాదం జరగడంతో యాజమాన్య నిర్లక్ష్యమే దీనికి కారణమా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పదేపదే ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఉలిక్కిపడ్డ పరిసర ప్రాంతాల గ్రామాలు:
రియాక్టర్ పేలుడు ధాటికి భారీ శబ్దం రావడంతో దోతిగూడెం, పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం తీవ్రతపై ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న కార్మికుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కంపెనీ వద్దకు చేరుకున్నారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని, నిబంధనలు పాటించని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

