• చౌటుప్పల్‌లో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు
• సహకార పతాకాన్ని ఆవిష్కరించిన సంఘ అధ్యక్షుడు బడుగు మోహన్ బాబు
• హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ పావని, వైస్ చైర్మన్ వినయ్, ప్రముఖులు
సూర్య డిజిటల్ న్యూస్, చౌటుప్పల్:
చేనేత కార్మికుల సంక్షేమానికి, చేనేత రంగాభివృద్ధికి సహకార సంఘాలు అందిస్తున్న సేవలు కొనియాడదగినవని పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం చౌటుప్పల్ చేనేత సహకార సంఘ భవన ప్రాంగణంలో వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం 9:05 గంటలకు చేనేత సహకార సంఘ అధ్యక్షుడు బడుగు మోహన్ బాబు జెండా వేదిక వద్ద సహకార పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా చౌటుప్పల్ పురపాలక సంఘ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ హాజరయ్యారు. అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త బడుగు లక్ష్మయ్య, జిల్లా చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు గుర్రం నరసింహ కూడా విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు.
నేతన్నల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ సహకరించాలి:
ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలలో చేనేత రంగానికి విశిష్ట స్థానం ఉందన్నారు. చేనేత వస్త్రాలను ధరించడం ద్వారా నేత కార్మికులకు ఆర్థికంగా చేయూత లభిస్తుందని తెలిపారు. నేతన్నల అభ్యున్నతికి, వారి నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు సంఘం ఆధ్వర్యంలో నిరంతరం కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.
ఈ వేడుకల్లో చౌటుప్పల్ చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షుడు గోశిక శ్రీకాంత్, కార్యదర్శి కాటబత్తిని భీమయ్య, కోశాధికారి బడుగు సావిత్రిలతో పాటు కార్యవర్గ సభ్యులు, పలువురు పారిశ్రామికవేత్తలు, చేనేత ప్రముఖులు, సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

