సూర్య డిజిటల్ న్యూస్, వనస్థలిపురం:
ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హస్తినాపురంలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. హస్తినాపురానికి చెందిన చలిచీమల కిశోర్‌బాబు (38) సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నెల 20న మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సాయంత్రం 5 గంటల సమయంలో బయట నుంచి ఇంటికి వచ్చిన భార్య గమనించి వెంటనే కిశోర్‌బాబును ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలపై తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

